ముప్పై మూడు కోట్ల దేవతలు..................!!
ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే 33 రకాల
ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతం లో
కోటి అంటే విభాగం అని అర్ధం.
మొత్తం ముప్పైమూడు రకాలయిన దేవతలు
అని అర్ధం వస్తుంది.
వైశ్వదేవ శాస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు.
ఆ మంత్రము ద్వారా 303 దేవతలు,
3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు.
కాని 33 మంది దేవతల యొక్క విభూతులే ఆ మొత్తం దేవతలందరూ.
వారే ఆరుగురు దేవతలుగాను,
ముగ్గురు దేవతలుగాను,
ఇద్దరు దేవతలుగాను,
ఒకటిన్నర దేవత గాను
చివరగా ఒక్క దేవతగాను అయ్యారు.
అష్ట వసువులు,
ఏకాదశ రుద్రులు,
ద్వాదశ ఆదిత్యులు,
ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజాపతి) కలిపి
మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.
అష్ట వసువులు:
అగ్ని,
పృథివి,
వాయువు,
అంతరిక్షము,
ఆదిత్యుడు,
ద్యులోకము,
చంద్రుడు,
నక్షత్రాలు
అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది.
అందుచే వారికి వసువులని పేరు.
(భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి
వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి యందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు.)
ఏకాదశ రుద్రులు :
ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు,
మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు
మొత్తం పదకొండు రుద్రులు.
ఆత్మయే పదకొండవ రుద్రుడు.
ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలనని,
విడిచి వెళ్ళననిచెప్పడం మానవునికి దుఃఖ హేతువు.
ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” – రుద్రులు అని పేరు వచ్చింది.
(ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరి దయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే.)
ద్వాదశ ఆదిత్యులు :
సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు..
పన్నెండు ఆదిత్య దేవతలు.
ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి.
ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు.
ఆయా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించుచుండడం చేత “ఆదదానః” ఆదిత్యులు అని పిలవబడుతున్నారు.
ఇంద్రప్రజాపతులు :
స్తనయిత్నువు అనేవాడే (మబ్బులు లేదా ఉరుములు) ఇంద్రుడు;
యజ్ఞమే ప్రజాపతి.
స్తనయిత్నువు అంటే వజ్రాయుధమే.
యజ్ఞమంటే యజ్ఞపశువే.
ఆరుగురు దేవతలు:
అగ్ని,
భూమి,
వాయువు,
అంతరిక్షము,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఆరు ఆరుగురు దేవతలు.
ఇంతకు ముందు చెప్పిన ముప్పయి ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.
ముగ్గురు దేవతలు:
భూమి,
సూర్యుడు,
ద్యులోకము
అనే ఈ మూడు లోకాలు ముగ్గురు దేవతలు.
సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.
ఇద్దరు దేవతలు:
అన్నము,
ప్రాణము
అనేవి రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.
సగము అధికముగా గల దేవత:
వాయువే ఒకటిన్నర దేవత.
వాయువే అధ్యర్ధము అన్నారు.
ఒకటి వాయువు ఒక దేవత.
వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతే కాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వాయువే కాబట్టి ఇంకొక అర్ధ భాగం గా పేర్కోని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించేరు.
ఒకే ఒక్క దేవత :
ప్రాణమే ఒక్క దేవత:
సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు.
అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మకమైన బ్రహ్మము గా అభివర్ణించేరు.
“జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన
ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.
ముప్పయి మూడు (3306) దేవతల యొక్క రూపమే
ఈ ప్రాణ దేవత.
అందుచేత ఆ ప్రాణమే బృహత్స్వరూపమైన
ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది.
https://governmentselfemployee.blogspot.com/2020/04/
0 Comments