సద్గుణాలు
"ప్రతి వ్యక్తికీ కొన్ని సందర్భాలలో కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకు కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యం, సంపద ఉన్నప్పుడు నిరాడంబరం, రణభూమిలో పరాక్రమ సాహసాలు, విద్యార్జన సమయంలో ఉత్సాహం, అందరి ముందు చక్కగా మాట్లాడే నేర్పరితనం ఉండాలి."
"సాదారణంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ మంచి రోజులుంటాయి, అలాగే కొంత చెడుకాలమూ ఉంటుంది. కష్టకాలం దాపురించినపుడు తన జీవితంలో మంచికాలం పూర్తి అయుందనీ మళ్లీ అది రాదనీ భావించరాదు. రాత్రి తరువాత పగలు వచ్చినట్లే, చెడురోజుల తరువాత మంచి రోజులు తప్పక వస్తాయి. ఇటువంటి దృఢమైన విస్వాసం ఉన్నపుడే, మానవుడు తన జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొగలడు."
"రామాయణ గాథలో శ్రీ రామచంద్రుడు, మహాభారతంలో యుధిష్టరుడు అరణ్యవాసం చేయవలసివచ్చింది. అయినా వాళ్ళు చాలా దృఢచిత్తులై ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని, చివరిలో ఆనందాన్ని పొందగలిగారు. అలాగే అమితమైన సంపదలను పొందినప్పుడు అదంతా దైవ కృప వలన సాధ్యమయిందని భావిస్తూ, వినయంగా నిరాడంబరంగా జీవించటం ప్రతివారూ నేర్చుకోవాలి. అలా కాకుండా గర్వంతో దుష్కృత్యాలకు పాల్పడితే, చివరికి కష్టాలపాలు కాక తప్పదు."
"రావణుడు, దుర్యోధనుడు మొదలగువారు సర్వ సంపదలను పొందారు. కాని అహంభావంతో అధర్మానికి పాల్పడి అకృత్యాలనొనర్చారు. అందువలన చివరికి నాశన మయ్యారు."
"యుద్ధ రంగాన్నికి ప్రవేశించే వీరునికి పరాక్రమ సాహసాలు ముఖ్యంగా కావాలి. ఇతరులకు బాధ కలుగుతుందేమోనని, ఎదుటి వారితో యుద్ధం చేయటానికి సందేహించరాదు. ఏది ఏమైనా అతడు యుద్ధం చేయటం మానుకోకూడదు."
"ఒక విషయంలో మాత్రం మానవునికి తృప్తి పనికిరాదు, అది విద్యార్జనలో అతను ఎంత విద్యావంతుడైనా, మరింతగా విద్యనార్జించటానికి ప్రయత్నించాలి. పండితులతో, విద్వాంసులతో, సజ్జనులతో సాన్నిహిత్యాన్ని కల్పించుకుని, తద్వారా తన జ్ఞానాన్ని పెంచుకునే సదవకాశాలను రూపొందించుకోవాలి."
"అలాగే సభలో ప్రసంగించేటప్పుడు శ్రోతల హృదయాలను రంజింపచేయగల సామర్ధ్యాన్ని సంపాదించుకోవాలి. నిరంతర అభ్యాసం ద్వారా ఈ లక్షణాలను పెంచుకుంటే మానవుని జీవితంలో తప్పనిసరిగా మంచి మార్పును మనం చూడగలం."
0 Comments