నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

 "నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర"

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర"….

👁️🔍ఇమేజ్ పై క్లిక్ చేయండి పెద్ద వ్యూ లో క్లియర్ గా చూడండి👇

సాహిత్యం

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ చూడక ఇద్దరి బ్రోవుము రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

భావం

ఇక్ష్వాకువంశ తిలకుడవైన శ్రీరామచంద్రా! ఇకనైన పలుకుము. నన్ను నువు రక్షించకుంటే వేరెవరు రక్షించెదరు?

 ఈ దేవాలయము చుట్టూ ప్రాకారము ఎంతో అందంగా కట్టించాను, ఆ ప్రాకారానికి పదివేల వరహాలు పట్టాయి. ఇకనైన పలికి నన్ను రక్షించుము.

 శ్రీరామచంద్రా! దేవాలయానికి గోపురము, మంటపాలు స్థిరముగా కట్టించాను, ఇవన్నీ నీకు తెలియవా? నన్ను క్రొత్తగా చూడకుండా ఈ చెరసాలలో ఉన్న నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

నీ ప్రియసోదరుడైన భరతునికి పచ్చల పతకము చేయించాను, దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

నీ కనిష్ఠ సోదరుడైన శత్రుఘ్నునికి బంగారు మొలత్రాడు చేయించాను, దానికి పదివేల మొహరీలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

లక్ష్మణునికి ముత్యాల పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

సీతమ్మకు చింతాకు పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

నీకోసం అందమైన శిరోభూషణము చేయించాను. ఎవడబ్బ సొమ్మని వాటిని పెట్టుకుని కులుకుతూ తిరుగుతున్నావు! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము.

 ఈ ఆభరణాలు మీ నాన్న గారు దశరథ మహారాజు చేయించారా లేక మామగారు జనకమహారాజు కానుకగా పంపించారా! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! 

నేను ఈ విధంగా దూషిస్తున్నానని కోపగించుకోవద్దు. ఈ తానీష సైనికులు కొట్టే దెబ్బలను భరించలేక అలా చేస్తున్నాను. ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. భక్తులను పరిపాలించే ఓ శ్రీరామచంద్రా! నువ్వు శుభముగా నన్ను రక్షించుము. 

Post a Comment

0 Comments