శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసనద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్
మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద. ఆ ఇద్దరినీ అనుగ్రహించటానికి వారి ముద్దుబిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య. ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్యపదం 'శ్రీ' తో కూడినది. 'శ్రీ' అంటే లోకాలను, లోకులను - సర్వాన్నీ నడిపించే మహాశక్తి. దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం. దానికోసం శ్రీకృష్ణవాసుదేవుని నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాను.ఆ పసిబిడ్డ లోకాలను రక్షించటం అనే ఒకేఒక్క కార్యం కలవాడు. భక్తులను కాపాడటం అనే కళలో తొందరతనం కలవాడు. రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు. ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు. అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను.
తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్భాగవత అమృతాన్ని తెలుగుజాతికి అందించటానికి పూనుకొని ముందుగా నందాంగనా డింభకుడైన శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు. మనలను కూడా నిలుపుకోమంటున్నాడు.
శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుటకునై = పొందుటకై; చింతించెదన్ = ప్రార్థిస్తాను; లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించటమనే; ఏక = ముఖ్యమైన; ఆరంభకు = సంకల్పం కలవానికి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = నేర్పునందు; సంరంభకున్ = వేగిరపాటు ఉన్నవానికి; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభకున్ = మ్రాన్పడేలా చేసేవానికి; కేళి = ఆటలలో; లోల = అందంగా; విలసత్ = ప్రకాశించే; దృక్జాల= చూపుల వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; కంజాత భవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగినవానికి; మహా = గొప్పవాడైన; నందాంగనా = నందుని భార్య (యశోద) యొక్క; డింభకున్ = కొడుకునకు;
0 Comments